REVANTH: భారీ వర్షం.. రేవంత్ కీలక ఆదేశాలు
నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు;
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు.
24 గంటల్లో భారీ వర్షాలు
ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని కారణంగా తీరం వెంబడి గంటకు 40-50 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 7.5 కి. మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
అతి భారీ వర్షాలు
రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని.. ముఖ్యంగా ఆదిలాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.