HYD: మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ మహా నగరం
మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్.... బల్దియా విభజన కసరత్తు పూర్తి... మారిపోతున్న భాగ్యనగర చిత్రం... ఇప్పటికే పరోక్షంగా చెప్పిన రేవంత్
హైదరాబాద్ మహానగర పాలనలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన 2071 చదరపు కిలోమీటర్ల కోర్ అర్బన్ రీజియన్ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 2న జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై అధికారిక స్పష్టత రానుంది. అందుకు తగ్గట్టే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించింది. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10వరకు ఉండటంతో.. నగరపాలక సంస్థల ఏర్పాటు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిందని, పాలకమండలి గడువు పూర్తవగానే మూడు మహా నగరాలు ఏర్పాటవుతాయనే విషయంపై సచివాలయంలో జరిగిన సమీక్షలో రేవంత్‌రెడ్డి అధికారులకు పరోక్షంగా సంకేతాలిచ్చారు. . ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిలో మూసీ నదికి దక్షిణాన ఉన్న నాలుగు జోన్లు, నగరంలోని సికింద్రాబాద్, గోల్కొండ జోన్లు ఉంటాయి. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీసీఎంసీ), మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లతో గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(జీఎంఎంసీ) ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ స్థానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కొత్త కార్పొరేషన్లు కొలువుదీరనున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర గుండెకాయ వంటి ప్రాంతాలను కలిగి ఉండనుంది. సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట నుంచి శంషాబాద్ వరకు విస్తరించి.. మొత్తం 150 డివిజన్లతో ఏర్పాటు కానుంది. పాతబస్తీ, సెంట్రల్ హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. ఐటీ హబ్‌గా పేరుగాంచిన పశ్చిమ హైదరాబాద్ ప్రాంతమంతా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. నార్సింగి నుంచి శామీర్‌పేట జీనోమ్ వ్యాలీ వరకు 74 డివిజన్లతో ఇది ఏర్పాటు కానుంది. ఉత్తర, తూర్పు హైదరాబాద్‌ను కలుపుతూ కీసర నుంచి పెద్ద అంబర్‌పేట వరకు 76 డివిజన్లతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడనుంది. కొత్త కార్పొరేషన్ల కోసం ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించనుంది.