Irani Chai: భాగ్యనగరవాసులు.. ఇరానీ ఛాయ్‌ని ఇక మర్చిపోవలసిందేనా!!

Irani Chai: భాగ్యనగర వాసులకు ఇరానీ ఛాయ్‌తో ఇక రుణానుబంధం తీరిపోతోంది. భగ్న ప్రేమికుల్లా ఒకరికొకరు దూరమయ్యే పరిస్థితి రాబోతోంది.

Update: 2022-12-10 10:12 GMT

Irani Chai: భాగ్యనగర వాసులకు ఇరానీ ఛాయ్‌తో ఇక రుణానుబంధం తీరిపోతోంది. భగ్న ప్రేమికుల్లా ఒకరికొకరు దూరమయ్యే పరిస్థితి రాబోతోంది. పొగలు కక్కే ఇరానీ ఛాయ్‌ను తాగకుండా ఉండలేరు. అలాగని ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని భరించలేరు.



అందుకే, దశాబ్దాలుగా అలవాటుపడిన నాలుకే.. ఇక నీకు సెలవు మిత్రమా అనేస్తోంది. దీనంతటికీ కారణం.. ఇరానీ ఛాయ్‌ ధర పెరగడమే. ఒకప్పుడు ఐదు రూపాయలు పెడితే.. కమ్మని ఛాయ్‌ నోట్లో పడేది. ఆ తరువాత పది రూపాయలకు, 15 రూపాయలకు పెరిగింది. ఎంతైనా.. అలవాటుపడ్డ ప్రాణం కదా.. ధర మూడింతలైనా సరే ఇరానీ ఛాయ్‌ని వదల్లేదు.



ఇప్పుడు చూస్తుండగానే.. 20 రూపాయలకు, కొన్ని చోట్ల పాతిక రూపాయలకు పెరిగింది. అందుకే, ఇక ఇరానీ ఛాయ్‌కి గుడ్‌బై చెప్పక తప్పడం లేదంటున్నారు భాగ్యనగర వాసులు. హైదరాబాదీ బిర్యానీ ఎంత ఫేమస్సో.. హైదరాబాద్‌లో ఇరానీ ఛాయ్‌ కూడా అంతే ఫేమస్.




పనికి వెళ్తున్నా, పని అయిపోయినా.. నిద్ర మత్తు వదలాలన్నా, ఫ్రెండ్స్‌తో కాలక్షేపానికైనా.. దేనికైనా తోడుండాల్సింది ఇరానీ ఛాయే. హైదరాబాద్‌ నగర ప్రజలతో ఇరానీ ఛాయ్‌కి అంత విడదీయరాని బంధం ఉంది. పైగా ఈ ఛాయ్‌ని ఎక్కువగా తీసుకునేది పేద, మధ్య తరగతి వాళ్లే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరవై, పాతిక రూపాయలు పెట్టి కప్పు టీ తాగేంత సీన్ కనిపించడం లేదు. అందుకే, క్రమంగా ఇరానీ ఛాయ్‌కు నగర ప్రజలు దూరం అవుతున్నారు.



హోటల్స్‌, కేఫ్‌ వాళ్లు కూడా నగరంలో ఇరానీ ఛాయ్‌కి గిరాకీ తగ్గిందనే చెబుతున్నారు. పాల ప్యాకెట్‌ ధర 60 రూపాయలు పలుకుతోంది. కిలో టీ పొడి కూడా ఐదారు వందలు దాటేసింది. దీనికి తోడు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర మండిపోతోంది. టీ మాస్టర్లకు నెలకు కనీసం 20, 25వేల రూపాయల జీతం ఇవ్వాల్సి వస్తోంది.




ఇతర పని వాళ్లు, హోటల్‌ మెయింటనెన్స్‌ వేసుకుంటే అసలు ఇరానీ ఛాయ్ హోటళ్లు నడపడమే తలకు మించిన భారంగా మారింది. దీంతో ధర పెంచక తప్పలేదని చెబుతున్నారు హోటళ్ల నిర్వాహకులు. అసలే ధరలు కొండంత పెరిగిన ఈ రోజుల్లో... 20, పాతిక రూపాయలు పెట్టి ఇరానీ ఛాయ్‌ ఎవరు తాగుతారని ప్రశ్నిస్తున్నారు. ధరాభారం ఇలాగే కొనసాగితే.. ఇకపై ఇరానీ ఛాయ్‌ని పూర్తిగా మరిచిపోవాల్సి వస్తుందంటున్నారు భాగ్యనగరవాసులు. 

Tags:    

Similar News