హైదరాబాద్ మెట్రో మరో ఘనత సాధించింది. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. గుండె మార్పిడి చికిత్స కోసం గుండెను తరలించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ కు శుక్రవారం రాత్రి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి నుంచి లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి వరకు 13 కిలోమీటర్ల మేర గుండెను మెట్రోలో 13 నిమిషాల్లో తరలించారు. దాత నుంచి సేకరించిన గుండెను తీసుకుని రాత్రి 9.30 గంటలకు ఎల్‌బీనగర్‌లో మెట్రో ఎక్కిన డాక్టర్లు లక్డీకాపూల్‌లోని ఆస్పత్రికి 9.43కి చేరుకున్నారు. కామినేని ఆస్పత్రి నుంచి ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్‌కు రోడ్డు మార్గంలో గుండె తరలించేందుకు నాలుగు నిమిషాలు పట్టినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్గ నవీన్ కు బ్రెయిన్ డెడ్ కావడంతో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు సేకరించారు. ఇందులో గుండెను కార్డియో మయోపతి సమస్యతో బాధపడుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తికి అమర్చేందుకు గ్లోబల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ అజయ్ జోషి ఆధ్వర్యంలో వైద్య బృందం హార్ట్ ఆపరేషన్ ను పూర్తి చేశారు. మరోవైపు కామినేని ఆస్పత్రి నుంచి గ్రీన్ చానెల్ ఏర్పాటుచేసి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఊపిరితిత్తులను ప్రత్యేక అంబులెన్స్‌లో హైటెక్‌సిటీలోని యశోద ఆస్పత్రికి తరలించారు.