ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు నిలిచిన బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ కాలనీని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు పరిశీలించారు. వర్షపు నీటితో పాటు.. మురుగు నీరు ముంచెత్తడానికి గల కారణాలను తెలుసుకున్నారు. హుస్సేన్‌సాగర్ ఔట్‌లెట్ నాలాను కలుపుతూ 30 ఏళ్ల క్రితం నిర్మించిన పైపులైను బ్లాక్ అవ్వడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. ఇక్కడి ఖాళీ ప్లాట్‌లో బోరు వేసినప్పుడు పైపులైను దెబ్బతినిందని చెప్పారు. వెంటనే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న పైపులైనుకు మరమ్మతులు చేపట్టాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఈ లోగా మోటార్లు పెట్టి నీటిని మొత్తం ఖాళీ చేయాలని సూచించారు. సమస్యను తెలుసుకుని వెంటనే ఇక్కడకు వచ్చి పరిశీలించిన కమిషనర్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.