గ్రేటర్లో హైడ్రా పంజా.. మల్లంపేట్‌లోని ఓ కన్‌స్ట్రక్షన్ విల్లాలో కూల్చివేతలు
హైదరాబాద్ మహా నగరంలో అక్రమ నిర్మాణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాల పరిధిలో ఆక్రమణలు కూల్చివేస్తోంది. ఇప్పటి వరకు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోని వ్యాపార కార్యకలాపాల జోలికి మాత్రమే వెళ్లింది. మాదాపూర్, సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అపార్ట్మెంట్‌ను ఆదివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో తమ ఇల్లు కూలుస్తున్నారని ఓ మహిళ కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కడుపు కొట్టడానికే తమ ఇల్లు కూలగొడ్తున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని హెచ్‌ఎంటీ కాలనీ, వాణీనగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.