TG : రూ.400 కోట్లు ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు : బాల్క సుమన్
హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ( Balka Suman ) సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) రూ.400 కోట్లు అడిగితే ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారని బాల్క సుమన్ ఆరోపణలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన సుమన్.. ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఉందని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టారు. అయితే హిమాయత్ సాగర్‌లో ఆనంద కన్వెన్షన్ ఉంది. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు, సిఫాయి, హైదరా బాద్‌లోని చెరువులను రక్షించే రక్షడు రేవంత్ రెడ్డి ఆనంద కన్వెన్షన్‌ను ఎందుకు కూలగొట్టడం లేదని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ఏంటంటే నాగార్జున రూ.400 కోట్లు ఇవ్వనందుకే కూల్చివేస్తున్నారనే చర్చ జరుగుతుందన్నారు. ఆనంద కన్వెన్షన్ వాళ్లు ముడుపులు ముట్ట చెప్పినందుకే కూల్చలేదని ఆరోపణలు చేశారు. మాదాపూర్‌లోని సున్నం చెరువు దగ్గర దళిత బిడ్డలు ఇండ్లు కూలగొట్టారని, మహబూబ్‌నగర్‌లోనూ పేదల ఇండ్లు కూలగొట్టారని, కానీ గండిపేట చెరువులో 18 ఎకరాల్లో కట్టిన మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ చెరువును ఆక్రమించి ఫాంహౌజ్, గోల్ఫ్ కోర్స్ నిర్మిస్తే ఎందుకు కూలగొట్టవని ప్రశ్నించారు. వారి కాంపాండ్ వాల్ ముట్టుకునే దమ్ముందా అని నిలదీశారు. పేదల ఇండ్లు కూల్చేందుకు రంగనాథ్‌కు, సీఎంకు బుల్డోజర్లు దొరుకుతవి కానీ, వివేక్ ఇంటిని ముట్టుకోవడానికి దొరుకవా అని ప్రశ్నించారు. పేదలకు ఒక నీతి, మీడియా అధిపతులకు, పారిశ్రామిక వేత్తలకు ఇంకో నీతా అని నిలదీశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఆలోచన చెయ్యాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల నుంచి దృష్టి మరల్చేందుకే హైడ్రా కూల్చివేతలకు తెరలేపిందని సుమన్ విమర్శించారు.