భూముల కబ్జాకు ప్రయత్నించారనే బీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య ఆరోపణలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ‘నాపై కబ్జా ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవి విడిచి మీకు గులాంగిరి చేస్తాను. లేకపోతే మీరు నాకు గులాంగిరి చేయాలి’ అని వారికి సవాల్ విసిరారు. చీము నెత్తురు ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. ఉపఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమని కడియం స్పష్టం చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎలాంటి ఆక్రమాలకు పాల్పడలేదని, గుంట భూమి కూడా కబ్జా చేయలేదని తెలిపారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. కడియం శ్రీహారిపై బలంగా ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్… ఆయనపై భూకబ్జా ఆరోపణలు చేసింది. దేవనూరు గుట్టలను ఆక్రమిస్తున్నారంటూ , మొత్తంగా 2వేల ఎకరాలను భూకబ్జా చేశారని తాటికొండ రాజయ్య ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అదే జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఓ చోట 25ఎకరాలు , మరో చోట యాభై ఎకరాలు కడియం కబ్జా చేశారని, వాటిని బినామీలకు అప్పగించారన్నారు.