హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుకు తనపై కేసు పెడితే జైలుకు వెళ్లేందుకు సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనను రెండు మూడు నెలలు జైల్లో పెడితే హ్యాపీగా వెళతానన్నారు. యోగా చేసుకుని .. బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానన్నారు. తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. రాజ్‌భవన్‌లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి తన అరెస్టుకు కుట్ర చేస్తున్నాయనని ఆరోపించారు. అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్‌రెడ్డి ఇవన్నీ చేస్తున్నారన్నారు.
హైదరాబాద్ నగరంలో ఎఫ్1 జరపాలనేది రెండు దశాబ్దాల కల అనీ.. దాన్ని తాము నెరవేర్చామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా వన్ రేస్ నిర్వహణ కోసం ప్రపంచ దేశాలు పోటీపడతాయని గుర్తు చేశారు. 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం, రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఎఫ్1 నిర్వహించాలని CEOని కలిశారన్నారు. గురువు చంద్రబాబు కన్న కలను శిష్యుడు రేవంత్ రెడ్డి నెరవేర్చలేదు కానీ తాము నెరవేర్చామని తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్ కోసం ఢిల్లీ ప్రభుత్వం 70 వేల 608 కోట్లు ఖర్చు పెట్టిందనీ.. క్రీడల మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టడం పరిపాటే అన్నారు. ఫార్ములా వన్ రేస్ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కామన్‌వెల్త్ క్రీడలంటే కాంగ్రెస్ చేసిన కుంభకోణం గుర్తొస్తోందన్నారు కేటీఆర్.