HYD: ఉప్పల్‌లో స్కైవాక్ ప్రారంభం నేడే..
హైదరాబాద్‌లో మరో మణిహారం ఆవిష్కృతం కానుంది;
హైదరాబాద్‌లో మరో మణిహారం ఆవిష్కృతం కానుంది. ఇవాళ ఉప్పల్‌లో స్కైవాక్ ప్రారంభం కానుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ఉప్పల్ స్కైవేను మంత్రి కేటీఆర్ కాసేపట్లో ప్రారంభిస్తారు. ఉప్పల్ సహా భాగ్యనగర ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ అద్భుత మణిహారం.. ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది.
ఉప్పల్ రింగ్ రోడ్స్ దగ్గర సుమారు 25 కోట్ల రూపాయలతో ఈ స్కై వాక్‌ని నిర్మించింది HMDA. మొత్తం 37 పిల్లర్లు.. 660 మీటర్ల పొడువు.. 6 మీటర్ల ఎత్తుతో నిర్మించారు HMDA అధికారులు. నగరవాసులు.. ఈజీగా ఉప్పల్ క్రాస్ రోడ్స్‌ను దాటేందుకు.. అటు నుంచి ఇటు రోడ్డుకు వెళ్లేందుకు వీలుగా.. మొత్తం 6 ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు, వృద్ధులు కూడా సులభంగా మెట్లు ఎక్కి, సౌకర్యవంతంగా వెళ్లేందుకు, ఉప్పల్‌లోని అన్ని బస్టాప్‌లకూ చేరుకునేందుకు వీలుగా ఈ స్కై వాక్‌ను నిర్మించారు.
ఈ స్కైవే ద్వారా ఉప్పల్ మెట్రో రైల్వేస్టేషన్‌కి కనెక్టవిటీ పెట్టారు HMDA అధికారులు. డైరెక్టుగా మెట్రో స్టేషన్ లోపలికి వెళ్లొచ్చు. ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలు త్వరగా ప్పల్ మెట్రో రైల్వేస్టేషన్‌కి చేరుకోవచ్చు. ఉప్పల్ స్కైవాక్‌లో మొత్తం 8 లిఫ్టులు ఉన్నాయి. 4 ఎస్కలేటర్లు, 6 మెట్ల మార్గాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ రేంజ్‌లో నిర్మించిన ఈ అద్భుత స్కైవే రూఫ్‌కి టెన్సిల్ ఫ్యాబ్రిక్ సైతం వాడారు. ఈ స్కైవాక్ అంతటా LED లైట్లు అమర్చారు. దీంతో రాత్రివేళ కూడా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
ఉదయం 11 గంటలకు ఈ స్కైవాక్‌ని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఉప్పల్ శిల్పారామంలో నిర్మించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.