ఇంటర్మీయట్ ఫెయిల్ అయ్యానన్న మనస్థాపంతో విద్యార్థిని నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన రెడ్డి పూజ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాలలో ఆమె ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో తన నానమ్మ గంగవ్వ దగ్గర ఉంటూ ప్రతిరోజు కళాశాలకు వెళుతోంది.
ఈ నెల 22న తన నానమ్మ గంగవ్వ తన కూతురు గ్రామమైన దేవునిపల్లి గ్రామానికి వెళ్లింది. రాత్రి ఆమె ఇంటికి రాకపోవడంతో పూజ ఇంట్లో ఒంటరిగా పడుకోలేక ఆమె పెద్దమ్మ ఇంటికి వెళ్లి పడుకుంది. ఉదయం లేచి ఇంటి వాకిలి ఊడ్చి వస్తానని చెప్పి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె మనస్థాపంతో నిప్పంటించుకుంది. ఇంటికి వెళ్లిన పూజా ఇంకా రావడం లేదని ఆమె పెద్దమ్మ వెళ్లి చూడగా పూజ మృతదేహం కాలిపోయి కనిపించింది. దీంతో ఆమె బోరున విలపించడంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న పుస్తకాలతో పాటు కరెంటు వైర్లు సైతం కాలిపోయాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.