T-Congress: టీ-కాంగ్రెస్‌లో అంతర్గత యుద్ధం.. రేవంత్ రెడ్డిపై సీనియర్లు ఫైర్
T-Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఒరిజినల్ వర్సెస్ వలస నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.;
T-Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఒరిజినల్ వర్సెస్ వలస నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫస్ట్ డే.. రేవంత్ రెడ్డి వర్గంపై సీనియర్లు మండిపడితే, ఆ నెక్ట్స్ డే.. రేవంత్‌రెడ్డి వర్గం నుంచి సీనియర్లకు అనూహ్య ఎదురుదాడి మొదలైంది.
పీసీసీ కొత్త కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యత ఇచ్చారంటూ కాంగ్రెస్ సీనియర్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా సీనియర్ నేతలు రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్రంగా స్పందించారు. దీనికి రేవంత్‌రెడ్డి వర్గం అంతే ధీటుగా సమాధానం ఇచ్చింది. ఎమ్మెల్యే సీతక్క సహా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 12 మంది నేతలు పీసీసీ కమిటీల్లో తమ పదవులకు రాజీనామా చేశారు.
టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై టీడీపీలో ఉన్నప్పుడే రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాజీలేని పోరాటం చేశామని రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ నాయకత్వంలో, రాహుల్‌గాంధీ ఆహ్వానం మేరకు, రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఆరేళ్ల కిందట పార్టీలో చేరామని లేఖలో తెలిపారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి సారథ్యంలోనూ తామంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమన్న స్పృహతోనే వ్యవహరిస్తున్నామని తెలిపారు. పీసీసీ కమిటీల్లోని పదవులు తమ బాధ్యతను మరింత పెంచాయనే తాము భావించామని తెలిపారు.
మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు ఇంకా గరంగానే ఉన్నారు. రేవంత్‌రెడ్డి పాల్గొనే ఏ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే, నిన్న గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశానికి సైతం సీనియర్లు డుమ్మా కొట్టారు.
జనవరి 24న ముగియనున్న రాహుల్ భారత్ జోడో కార్యక్రమానికి కొనసాగింపుగా జనవరి 26 నుంచి రెండు నెలలపాటు దేశ వ్యాప్తంగా హాత్‌సే హాత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని ఏఐసీసీ ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో ఎలా జరపాలన్నదానిపై నిర్వహించిన సమావేశానికి భట్టివిక్రమార్క, ఉత్తమ్, మధుయాష్కీ, జగ్గారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ఇతర అసంతృప్త నేతలు గైర్హాజరయ్యారు.
మొత్తానికి రేవంత్‌రెడ్డి వర్గంపై సీనియర్లు ఫైర్ అవడం, సీనియర్లపై రేవంత్ వర్గం నేతలు మండిపడడం, టీడీపీ నుంచి వచ్చిన నేతలు రాజీనామా అస్త్రం సంధించడంతో.. తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయం హాట్‌హాట్‌గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు మహేశ్వర్‌రెడ్డి ఇంట్లో జరగనున్న సీనియర్ నేతల సమావేశం మరింత ఆసక్తికరంగా మారింది.