HCU: హైదరాబాద్ యూనివర్సిటీ భూ వివాదం
వేలం వేసిన భూములు ప్రభుత్వానివే.. సర్కార్ క్లారిటీ;
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ భూముల విక్రయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పాటు చేసి, ఈ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్ యూనివర్సిటీ భూములను విక్రయించకుండా, విద్యా అవసరాల కోసం భద్రపరచాలని ఉందని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ స్థాపన సమయంలో 2,300 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. కానీ, గత 50 ఏళ్లలో సుమారు 500 ఎకరాలు వివిధ కారణాలతో వెనక్కు తీసుకున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం, యూజీసీ లెక్కల ప్రకారం, యూనివర్సిటీ వద్ద 1,800 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తాజాగా, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIC) ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనల సందర్భంగా, పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. విద్యార్థులు యూనివర్సిటీ భూముల విక్రయాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
కోర్టు తీర్పు మేరకే..
మరోవైపు, ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమి యూనివర్సిటీకి చెందినది కాదని, కోర్టు తీర్పు మేరకు TGICకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వంటి పూర్వ విద్యార్థులను జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, యూనివర్సిటీ భూముల పరిరక్షణపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా, ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది.
విద్యార్థులపై కేసులు
మరోవైపు భూముల వేలానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై గచ్చిబౌలి పోలీసులు తాజాగా పలువురిపై కేసులు నమోదు చేశారు. పీహెచ్ డీ విద్యార్థులు ఎర్రం నవీన్ కుమార్, డాక్టర్.రోహిత్ బొండుగుల పై సెక్షన్ 329(3), 118(1), 132, 191(3), 351(3)r/w3(5) బిఎనఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరు ఏబీవీపీ విద్యార్థి కాగా మరొకరు(ఎస్ ఎఫ్ ఐ విభాగానికి చెందిన విద్యార్థులు. అలాగే ఇంకొంత మందిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్ సీయూలో సోమవారం భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.