ED Raids on Vivek: బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వినోద్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు
ఏకకాలంలో సోదరులిద్దరిపై సోదాలు;
మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వివేక్‌తో పాటు ఆయన సోదరుడు బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ మంత్రి జి.వినోద్ నివాసంలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రెండ్రోజుల క్రితం వివేక్ కంపెనీ ఖాతాల్లోకి రూ.8కోట్ల లావాదేవీలను గుర్తించి ఫ్రీజ్ చేశారు. మరోవైపు వివేక్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని బిఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలోనే వెంకటస్వామి కుమారులు వినోద్, వివేక్ నివాసాల్లో తెల్లవారు జాము నుంచి ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరుతో పాటు హైదరాబాద్‌లోని వివేక్, అతని బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఐటీ దాడుల్ని నిరసిస్తూ వివేక్ నివాసం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకటస్వామికి చెందిన కంపెనీల్లోకి భారీగా నగదు జమ అయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ కంపెనీల్లో నగదును సీజ్ చేశారు.
బషీర్‌బాగ్‌లోని ఐడీబీఐ బ్యాంకులో ఉన్న రెండు సంస్థల ఖాతాల్లోకి ఒకేసారి భారీ మొత్తంలో నగదు జమ కావడంతో ఆ నగదును స్తంభింప చేసినట్లు ఆదివారం పోలీసులు ప్రకటించారు. వివేక్ నివాసంలో దాదాపు నాలుగున్నర గంటల పాటు సోదాలు జరిగాయి. ఈ నెల 13న ఫ్రీజ్ చేసిన రూ.8 కోట్ల నగదుపై ఐటీ ఆరా తీసింది. అయితే వివేక్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈడీ అధికారులు వెళ్లిపోయారు. ఇంట్లో ఎలాంటి డాక్యుమెంట్లు, నగదును కూడా అధికారులు సీజ్ చేయనట్లు తెలుస్తోంది. అటు మంచిర్యాలలో ఈడీ, ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
అలాగే.. షాదన్ కాలేజ్‌లో పనిచేస్తున్న ఇక్బాల్ అహ్మద్ నివాసంలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్12 లో సోదాలు కొనసాగుతున్నాయి. కొమురంభీం జిల్లాలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్‌లో పలువురు వ్యాపారవేత్తల ఇళ్లల్లో ఐటీ తనిఖీలు జరుపుతోంది.