క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జేఎన్టీయూ వర్సిటీ విద్యార్థులు జాక్ పాట్ కొట్టారు. హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అరుదైన రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. కూకట్పల్లి జేఎన్టీయూ ప్రాంగణంలో సోమవారం ప్రముఖ సాఫ్ట్ వెర్ కంపెనీలు నిర్వహించిన ప్లేస్ మెంట్స్ ఇంటర్వ్యూల్లో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 9 మంది బీటెక్ విద్యార్థులకు అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న 9 మంది విద్యార్థులకు ఏకంగా ఏటా రూ.19 లక్షల ప్యాకేజీతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు లభించాయి. సోమవారం నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ విద్యార్థులకు సంవత్సరానికి రూ.19 లక్షల వేతనం ఇవ్వడా నికి ముందుకొచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంపికయిన విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేయకముందే నేరుగా 19 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావడంతో విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమ పిల్లలు బీటెక్ చదువుతుండగానే అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించినందుకు తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు.