jubileehills: ప్రచార పర్వానికి తెర..ప్రలోభ పర్వం ఆరంభం
ప్రారంభమైన ఓటర్ల ప్రలోభ పర్వం.. రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. అహరహం శ్రమించిన అధికార-విపక్షాలు.. 14వ తేదీన జూబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గెలుపు కోసం అహరహం శ్రమించాయి. ఆదివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితం తేలనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా.. అధికార కాంగ్రెస్ నుంచి నవీన్‌యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి బరిలో ఉన్నారు. మూడు పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 58 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 4,01,365 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఉపఎన్నిక కోసం 407 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 226 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 139 డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది.
పోలింగ్ సమయం గంట పెంపు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని తొలిసారిగా మరో గంట పాటు పొడిగించారు. 11న పోలింగ్ ఏడు గంటల నుంచి ప్రారంభమై ఆరు గంటల వరకు కొనసాగనున్నది. సాయంత్రం ఆరు గంటల కల్లా పోలింగ్ స్టేషన్ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక ఓటరూ ఓటును వినియోగించుకోనున్నారు. క్యూ లో ఎంత మంది ఉన్నా, ఎంత సమయం పట్టినా, అందరూ ఓట్లు వేసిన తర్వాతే పోలింగ్ ప్రక్రియ ముగించి, ఈవీఎంలను ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి, రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు తరలించనున్నారు. ఉప ఎన్నిక, జనరల్ ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటిస్తారు. ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని ఎప్పటికప్పుడు ఎన్నికల విభాగం అధికారులు సిఫార్సులు చేస్తున్నా, ప్రైవేటు సంస్థలు అంతంత మాత్రంగానే అమలు చేస్తున్నాయి. కానీ సరారు ఆఫీసులకు సెలవును ప్రకటించినా, కొందరు ఓటర్లు హాలీ డేను ఎంజాయ్ చేయటం తప్ప, ఓటింగ్‌లో పాల్గొనని సందర్భాలు సైతం లేకపోలేవు. గంట పాటు పోలింగ్ సమయాన్ని పెంచడం పై పోలింగ్ శాతం గతంలో కంటే పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.