రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని.. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘కాంగ్రెస్ నేతలు కోదండ రెడ్డి, కోదండరాం రెడ్డి, ఆది శ్రీనివాస్ ఈ ముగ్గురు రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని ఒప్పుకున్నారు. నేనూ అదే విషయం చెప్పా. రాష్ట్రంలో పాక్షికంగా రుణమాఫీ జరిగింది. 31 వేల కోట్లు అని చెప్పి 17 వేల కోట్లు మాత్రమే చేశారని నేనంటే ఎందుకు రంకెలేస్తున్నారు. రుణమాఫీ పూర్తయి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎందుకు నిరసనలు తెలుపుతారు? సీఎం దిష్టిబొమ్మలు, ప్రభుత్వ దిష్టిబొమ్మలను ఎందుకు దహనం చేస్తున్నారు?ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం, తొండి చేసైనా తామే గెలిచినం అనే వైఖరి ప్రదర్శించడం అవివేకం అవుతుంది. ఇప్పటికైనా కళ్లు తెరిచిరుణమాఫీ ప్రక్రియనుసమగ్రంగా పూర్తి చేయాలి. రైతులందరికీ న్యాయం చేయాలి’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ రావు కోరారు.