KAVITHA:కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోం

కేసీఆర్‌కు నోటీసులిస్తే తెలంగాణకు ఇచ్చినట్లే.. నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ 4న కవిత మహాధర్నా;

Update: 2025-06-01 06:00 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేతపై ఈగ వాలినా.. ఊరుకోబోమని ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కవిత కొత్త పార్టీ పెడతారన్న వార్తలు విస్తృతంగా వస్తున్న వేళ... కవిత బంజారాహిల్స్‌లో ‘తెలంగాణ జాగృతి’ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కొత్త కార్యాలయంలో కవిత, కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి విగ్రహం, బీఆర్ అంబేడ్కర్, ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలతో పాటు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఇవి బీఆర్‌ఎస్ నేతల ఫొటోలు ఎక్కడా లేవు. . ఈ కార్యలయాన్ని ప్రారంభించిన అనంతరం కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. " ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌కు నోటిసులిస్తారా.. . కేసీఆర్‌కు నోటీసులివ్వడమంటే తెలంగాణకు ఇచ్చినట్టే.” అని కవిత అన్నారు. " తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసినందుకు.. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారా. అసలు అది కాళేశ్వరం కమిషనా.. కాంగ్రెస్ కమిషనా. కేసీఆర్ పిడికిలి బిగిస్తేనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. జూన్ 4న ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా చేపడుతున్నాం. కేసీఆర్‌కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే.. మరో కన్ను తెలంగాణ జాగృతి. కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోం. గోదావరి జలాల్లో వాటా కాపాడకపోతే.. తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుంది’" అని కవిత ఘాటుగా స్పందించారు.

కేసీఆర్‌కు అవి రెండు కళ్లు

తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ జాగృతి సంస్థ పనిచేసిందని కవిత అన్నారు. కేసీఆర్‌, ఆచార్య జయశంకర్‌ స్ఫూర్తితో జాగృతి సంస్థ ఏర్పడిందని గుర్తు చేసిన కవిత. ఈ సంస్థను ప్రారంభించి 18ఏళ్లు అయిందని అన్నారు. ఇప్పటివరకు అశోక్‌నగర్‌లో జాగృతి కార్యాలయం ఉండేదని... ఇప్పుడు బంజారాహిల్స్‌కు మార్చామని వెల్లడించారు. ఇకపై ఇక్కడి నుంచే సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తామన్న కవిత.... ఇన్నేళ్ల ప్రయాణంలో ఎందరో ఆశీస్సులు అందించారుని అన్నారు. తాము చేసిన ఉద్యమాల వల్ల చాలా జీవోలు వచ్చాయని కవిత... పదేళ్ల కేసీఆర్‌ పాలనకు.. ఇప్పటి కాంగ్రెస్‌ పాలనకు ఎంతో తేడా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా ‘జై తెలంగాణ’ అని నినదించాలన్న కవిత... అమరవీరులకు నివాళులు అర్పించాలన్నారు. కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైనా రేవంత్‌రెడ్డి.. ‘జై తెలంగాణ’ అనాలని డిమాండ్ చేశారు. నివాళులర్పించని వారికి కుర్చీలో కూర్చునే అర్హత లేదు. కవిత లేఖలో... చేసిన ఆరోపణల్లో కొంత నిజం ఉన్నా.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది అయ్యే పని కాదన్న వాదన కూడా ఉంది. నిజానికి కేసీఆర్ బీఆర్ఎస్‌ను బీజేపీలోనే కాదు, కాంగ్రెస్ సహా మరే పార్టీలోనూ విలీనం చేయరని.. ఒక్క ఏన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ అస్తిత్వాన్ని చంపుకునే తప్పు కేసీఆర్ చేయరని ఆయన సన్నిహితులు అంటున్నారు. విలీనం ప్రతిపాదన చేశారని కేసీఆర్ మాజీ మిత్రులు అంటున్నారు.

రేవంత్‌పై తీవ్ర విమర్శలు

ఉద్యమకారులపైకి గన్ తీసుకెళ్లిన వాళ్లు.. ప్రస్తుతం రాష్ట్రానికి సీఎం అయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పథకాలకు తెలంగాణ వారి పేర్లే పెట్టాలన్న కవిత... తెలంగాణ యువ వికాసం అని ఉండాలి.. రాజీవ్ యువవికాసం అని కాదన్నారు. వేరే రాష్ట్రం తెలంగాణ నీళ్లు తీసుకెళ్తుంటే మాట్లాడలేని పరిస్థితి రేవంత్‌ది. బనకచర్ల ప్రాజెక్ట్‌పై రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదు. గోదావరి నీళ్లు శాశ్వతంగా దూరం కాబోతున్నాయి. ఏపీ ప్రయోజనాల కోసమే రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు. " జూన్‌ 2న రాజీవ్‌ యువ వికాసం  పథకం ఎందుకు తెస్తున్నారు. రాజీవ్‌ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం. తెలంగాణ యువ వికాసం అని ఉండాలి కానీ, రాజీవ్‌ యువ వికాసం అని ఉండకూడదు.” అని కవిత అన్నారు.

జూన్‌ 4న మహాధర్నా

జూన్‌ 4న ఇందిరా పార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని కవిత అన్నారు. మహా ధర్నాలో నోటీసుల కుట్ర మొత్తం వివరిస్తామన్న కవిత.. గోదావరి-కావేరీ లింకేజీతో నదీ జలాలు తెలంగాణకు శాశ్వతంగా దూరమవుతాయన్నారు. "బనకచర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారు? నదుల అనుసంధానాన్ని కేసీఆర్‌ వ్యతిరేకించారు. తుపాకుల గూడెం వద్ద రివర్‌ లింకేజీ ఉండాలని ఆయన సూచించారు. ఇచ్చింపల్లి వద్ద రివర్‌ లింకేజీ పెడతామని కేంద్రం చెప్పింది. జూన్‌ 2న నదీ జలాలపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం పెట్టాలని డిమాండ్‌ చేయాలి’’ అని కవిత డిమాండ్‌ చేశారు. **కేసీఆరే నాయకుడు, పార్టీని కాపాడుకుంటాను అని కవిత చెబుతున్నారు కానీ ఆమె చర్యలు ఆ దిశగా లేవు. పైగా ఆయనే తనపై చర్యలు తీసుకునేలా చేసి, అప్పుడు బయటకు వెళ్లే వ్యూహం కూడా కావచ్చనేది ఎక్కువమంది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పుడు బంతి కేసీఆర్ కోర్టులో పడింది. పార్టీకి ధిక్కార స్వరం వినిపిస్తున్న కవితపై ఏం చర్యలు తీసుకుంటారనేది పెద్ద ప్రశ్న. చర్యలు తీసుకోకపోతే ఈటలతో పోలిక వస్తుంది. ఈటల మాత్రమే కాదు, ఆలె నరేంద్ర, విజయశాంతి వంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్న కేసీఆర్… కూతురు విషయంలో వేచి చూసే ధోరణి చూపిస్తే, ఇప్పటికే ఉన్న కుటుంబ పార్టీ ముద్రకు మరింత బలం చేకూరుతుందన్న వాదన కూడా పార్టీలో వినిపిస్తోంది.

Tags:    

Similar News