KAVITHA: తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు
భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతకు ప్రయత్నం... కాంగ్రెస్ లో చేరుతుందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి బీజం పడింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ తరఫునే పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేయడంతో, తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలపై విశ్లేషణలు మొదలయ్యాయి. సోమవారం శాసనమండలిలో భావోద్వేగభరితంగా ప్రసంగించిన కవిత, అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపం (గన్‌పార్క్) వద్ద చేసిన వ్యాఖ్యలు ఈ విషయానికి మరింత బలం చేకూర్చాయి. ఇన్నాళ్లుగా తెలంగాణ జాగృతినే రాజకీయ వేదికగా కొనసాగిస్తారా? లేక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుస్తారా? అనే సందేహాలకు ఆమె ప్రసంగాలు స్పష్టతనిచ్చాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని చెప్పడం ద్వారా కొత్త పార్టీ రానుందన్న సంకేతాన్ని బలంగా ఇచ్చారు.
కవిత కాంగ్రెస్‌లో చేరినా...
ఎమ్మెల్సీ కవిత భవిష్యత్ రాజకీయ అడుగులపై ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ, కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చాయి. కవిత కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజకీయాల్లో మార్పులు సహజమని పేర్కొన్నారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకున్నట్టుగానే వచ్చారని గుర్తు చేశారు. అదే తరహాలో కవిత విషయంలో కూడా భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆశ్చర్యకరం కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కవిత రాజకీయ ప్రయాణంపై కొత్త ఊహాగానాలకు తెరలేపాయి. కవిత పేరు ప్రస్తావనతో పాటు, రంగారెడ్డి జిల్లా రాజకీయాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనే ప్రచారం పూర్తిగా ఊహాగానమే తప్ప, వాస్తవంగా అలాంటి ప్రతిపాదన లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలైనా ఏర్పాటు చేయవచ్చని, కానీ జిల్లా స్వరూపం మారకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
కిక్కిరిసిన తెలంగాణ జాగృతి కార్యాలయం
రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, కార్యకర్తలు బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కవితకు సంఘీభావం తెలుపుతూ మద్దతును ప్రకటించారు. అయితే, తనను కలిసేందుకు వచ్చిన జనసందోహానికి కవిత ఆమె ఇంటి బాల్కనీలో నిలబడి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం కిందకు వెళ్లి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను కవిత అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలం నుండి తన వెన్నంటి ఉండి, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ మద్దతుగా నిలిచిన ఉద్యమకారులను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో జాగృతి కార్యాలయం పరిసర ప్రాంతాలు ‘జై తెలంగాణ’, ‘కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి’ అనే నినాదాలతో మారుమోగాయి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కవిత గారికి అండగా ఉంటామని వివిధ సంఘాల నేతలు కవిత సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు.