NO Bail For Kavitha : కవితకు బెయిల్ లేనట్లే

విచారణను ఇరవయ్యో తేదీకి వాయిదా;

Update: 2024-08-12 07:45 GMT

 కవిత బెయిల్ ప్రాసెస్‌‌లో ఉందని వచ్చే వారంలో బెయిల్ వస్తుందని కేటీఆర్ అంచనాలు తలకిందులు అయ్యాయి. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. సీబీఐ, ఈడీ వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తామని వాటికి నోటీసులు జారీ చేసింది. మార్చి పదిహేనో తేదీ నుంచి జైల్లో ఉంటున్న ఎమ్మెల్సీ క‌విత‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చేందుకు జ‌స్టిస్ గ‌వాయి, జ‌స్టిస్ విశ్వ‌నాథ‌న్ ధ‌ర్మాస‌నం నిరాక‌రించింది.

ఎమ్మెల్సీ క‌విత త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించారు. 5 నెల‌లుగా క‌విత జైల్లో ఉన్నారని.. ఓ ప్ర‌జాప్రతినిధిగా, మ‌హిళ అయిన క‌విత‌ను ఇంకెంత కాలం జైల్లో ఉంచుతారు అంటూ రోహ‌త్గీ దర్యాప్తు సంస్థల తీరును ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్ప‌టికే మ‌నీష్ సిసోడియా, కేజ్రీవాల్ బెయిల్ పొందా రని కవిత కూడా బెయిల్‌కు అర్హురాలేనన్నారు. కేసు పెట్టిన ఈడీ, సీబీఐల‌కు తాము నోటీసులు జారీ చేస్తామ‌ని జ‌స్టిస్ గ‌వాయి చెప్పారు

అయితే మ‌ధ్యంత‌ర బెయిల్ అయినా ఇవ్వండి అని క‌విత లాయ‌ర్ రోహ‌త్గీ ధ‌ర్మాస‌నానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు జ‌స్టిస్ గవాయి నిరాక‌రించారు. దర్యాప్తు సంస్థల అభిప్రాయాల‌ను వెల్ల‌డించిన త‌ర్వాతే వాద‌న‌లు వింటామ‌ని అప్ప‌టి వ‌ర‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వ‌లేమ‌న్నారు.త‌దుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 20వ తేదీకి వాయిదా వేశారు. ఈ లోపు అఫిడ‌విట్ ఫైల్ చేయాల‌ని ఈడీ, సీబీఐల‌కు ఆదేశాలు జారీ చేశారు.  

అయితే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ లభించింది. ఆయన పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది కానీ.. సీబీఐ కేసులో లభించలేదు. ఆ బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. అప్రూవర్లుగా మారిన వారంతా బెయిల్ పొందారు. కానీ కవిత మాత్రం..దాదాపుగా ఐదు నెలలుగా జైల్లో ఉన్నారు.

Tags:    

Similar News