KCR: పరిణితితో ఓటెయ్యండి
ప్రజలకు కేసీఆర్ పిలుపు.... అభ్యర్థుల చరిత్ర చూసుకుని ఓటువేయాలని ప్రజలకు సూచన.....;
పాలమూరు జిల్లాను సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. సమైక్యపాలనలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల్ని అటకెక్కించినా కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. గులాబీ జెండా ఎగిరిన తర్వాత పాలమూరు పచ్చబడుతుంటే పెత్తనం కోసం వస్తున్నారని... పార్టీలు, అభ్యర్థుల చరిత్ర చూసుకుని ఓటువేయాలని ప్రజలకు K.C.R సూచించారు.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి K.C.R సుడిగాలి పర్యటన చేశారు. నాలుగుచోట్ల ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యంగా పర్యటన ప్రారంభించిన కేసీఆర్ దేవరకద్ర, గద్వాల్, మక్తల్, నారాయణపేట సభల్లో మాట్లాడారు.
ప్రధానంగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. పార్టీలు, అభ్యర్థుల చరిత్ర తెలుసుకుని పరిణితితో ఓట్లు వేస్తే.. ప్రజలు గెలుస్తారని సూచించారు. గత పాలకులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టారని ప్రాజెక్టులను రద్దు చేశారన్నారు. పాలమూరుకు అన్యాయం జరుగుతుంటే అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరుమెదపలేదని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారని అదే జరిగితే మరోసారి దళారుల రాజ్యం వస్తుందని పునరుద్ఘాటించారు. పెరుగుతున్న రాష్ట్ర ఆదాయానికి అనుగుణంగా సంక్షేమ పథకాల ఫలాల్ని ప్రజలకు పంచుతున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేసి.... ఉమ్మడి మహబూబ్‌నగర్ సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
గద్వాల ప్రాంతాన్ని గబ్బు పట్టించిన వారెవరని కేసీఆర్ ప్రశ్నించారు. గద్వాల ప్రాంతానికి ఘన చరిత్ర ఉందని, ఇక్కడ వాల్మీకి, బోయ సోదరులు ఎక్కువగా ఉంటారని చెప్పారు. ఆంధ్రాలో వారు ఎస్టీలని, ఇక్కడ మాత్రం బీసీలని అన్నారు. మన రాష్ట్రంలోనూ వాల్మీకి, బోయ తెగలను ఎస్టీల్లో కలిపేందుకు తాను ప్రయత్నించినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. కర్ణాటక నుంచి ఒక పెద్ద మనిషి తెలంగాణకు వచ్చారని.,.కర్ణాటలో ఐదు గంటలు కరెంటు ఇస్తున్నామని అబద్దాలు చెప్తున్నారని అన్నారు. ఇలాంటి మాటలే చెప్పి కర్ణాటక ప్రజలను మోసం చేశారని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ రాజ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మళ్లీ ఆ తరహా సమస్యలు తీసుకొచ్చుకుందామా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేసే ఎన్నో ఉత్తమ సంక్షేమ పథకాలు అమలు చేసుకున్నామన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో మున్సిపాలిటీగా నారాయణపేట ఏర్పడిందని, నారాయణపేట, కొడంగల్, మక్తల్‌కు నీళ్లు ఇచ్చే కాల్వలను మంజూరు చేశామని, టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే అతి త్వరలోనే కాల్వలను పూర్తి చేసుకుంటామని కేసీఆర్ తెలిపారు.