రేపటినుంచి జరుగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొననున్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. ఇందుకోసం ఈ మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. నగరంలోని నందినగర్ నివాసానికి వచ్చారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. శాసనసభ, మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. కేటీఆర్, హరీశ్ రావు సహా కీలక నేతలంతా హాజరయ్యారు. గత ఏడాది బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ సమయంలో బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ పూర్తిగా హాజరవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు