రాజకీయ స్వార్థం, తనపై కక్షతో కాంగ్రెస్ నేతలు పిచ్చిపనులకు పూనుకోవడం శోచనీయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ‘నా ఆనవాళ్లు లేకుండా చేయాలనే మూర్ఖపుతనంతో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. రేపటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించడం వెనక అసలు కోణం, ఉద్దేశం ఏదైనా వచ్చిన వారిని గౌరవించా. భోజనం పెట్టా. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు నేను పునాది వేయలేదా? రైతుబంధు ప్రారంభించలేదా?’ అని ఆయన ప్రశ్నించారు.
ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని కేసీఆర్ ధ్వజమెత్తారు. గురుకులాలు, విద్యారంగం, మూసీ, హైడ్రా, నిర్భంద పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎండగట్టాలని సూచించారు. ఫిబ్రవరిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిని నిలదీస్తామని చెప్పారు. మార్చిలో బీఆర్ఎస్ లో కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని వివరించారు గులాబీ దళపతి.
తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడాన్ని మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘ఇదొక మూర్ఖపు చర్య. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాల్లో మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని ప్రజలకు వివరించాలి’ అని బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలలకు ఆయన సూచించారు.