KCR: కరవు నేలపై కృష్ణమ్మ తాండవం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినే కేసీఆర్... కృష్ణ జలాల్లో వాటా తేల్చాలని కేంద్రానికి డిమాండ్;
కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా దశాబ్దకాలంగా కేంద్ర ప్రభుత్వం నాన్చుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. జెండాలు పట్టుకుని ఇక్కడ నిరసనలు చేయడం కాదని కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని ప్రధాని మోదీ దగ్గర ఆందోళన చేపట్టాలని బీజేపీ నేతలకు కేసీఆర్ హితవు పలికారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా నార్లాపూర్ వద్ద తొలి పంపు స్విచ్ఛాన్ చేసి మొదటి దశ ఎత్తిపోతలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. డెలివరీ సిస్టర్న్ వద్దకు చేరుకుని శ్రీశైలం వెనక జలాల నుంచి ఎత్తిపోసిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలను అభిషేకించేందుకు కృష్ణా జలాలతో నింపిన కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ అందజేశారు.
సమైక్య పాలనలో పదవుల కోసం తెలంగాణ ప్రాజెక్టులపై ఇక్కడి నేతలు నోరు మెదపలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం చరిత్రలో లిఖించ దగ్గ రోజుగా అభివర్ణించిన KCR, కరవు నేలపై కృష్ణమ్మ తాండవం చేస్తుంటే ఒళ్లు పులకరించి పోయిందన్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యమని చెప్పారు.
కొందరు నేతల వల్లే పాలమూరు-రంగారెడ్డి పథకం ఇన్నాళ్లు ఆలస్యమైందని కేసీఆర్ మండిపడ్డారు. ఇంటి దొంగలే తెలంగాణకు ప్రాణగండం తెచ్చారని ఆనాడు నోరు తెరిచి ఎవ్వరు అడగలేదన్నారు. పదవులకు ఆశపడి సమైక్య రాష్ట్ర సీఎంల వద్ద సాగిలపడ్డారని ఎద్దేవాచేశారు. పాలమూరు ఎత్తిపోతల మూడు, నాలుగు ఏళ్ల కిందే పూర్తయ్యేదని దాన్ని అడ్డుకున్నది మహబూబ్‌నగర్ రాజకీయ నాయకులేనని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా నుంచి వచ్చే 4వేల మెగావాట్ల కరెంట్‌తో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలంటే ఐక్యంగా సాగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
మహబూబ్‌నగర్‌లో JNTU ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు...కొల్లాపూర్ పట్టణ అభివృద్దికి ముఖ్యమంత్రి నిధి నుంచి 25 కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామపంచాయతీకి 15 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు.