KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రంగంలోకి కేసీఆర్
వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్న బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారు... ప్రణాళికలపై చర్చించిన మాజీ సీఎం కేసీఆర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించేందుకు వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది. ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో కేసీఆర్ కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్‌తో వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ అమలు చేయని హామీలను ప్రజలకు గుర్తుచేసి, స్థానిక కార్యకర్తలను అప్రమత్తం చేసి ఓటర్లతో అనుసంధానం పెంచాలని సూచించారు. ఈ ఎన్నికలో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని.. గెలుపు బీఆర్ఎస్కు దక్కుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేసీఆర్ అధికారిక ప్రకటన
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ను కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో, త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్ధిగా ఎంపిక చేశారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా, వారి నిబద్ధతను పరిశీలించిన మీదట, మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు, గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సతీమణి మాగంటి సునీతే పోటీ చేస్తారని ఇది వరకే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అధినేత ఆమోదంతో పార్టీ ప్రకటన చేసింది. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.
కేసీఆర్‌కు కృతజ్ఞతలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిత్వంపై సునీత పార్టీ అధినేత కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. మాగంటి గోపీనాథ్ పట్ల ఉన్న విశ్వాసంతో, నాపై నమ్మకం ఉంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇందుకుగానూ పార్టీ అధినేత కేసీఆర్‌కు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతు, ఆశీర్వాదం నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారామె.
ప్రజలు మన వైపే: కేసీఆర్
జూబ్లీహిల్స్‌లో రాజకీయ సమీకరణాలు తమకు అనుకూలంగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయని తెలిపారు. స్థానిక స్థాయిలోని శ్రేణులు ప్రజల్లో అవగాహన పెంపొందించి ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలు పెంపొందించాలని ఆదేశించారు. కాంగ్రెస్ పాలనలో అమలుకాలేని హామీలను ప్రజల ముందుంచి, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి నమ్మకం పొందాలని సూచించారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌పై విసుగుతో ఉన్నందున, ఇది పార్టీకి అవకాశం కలిగిస్తుందని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోపాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి కార్యకర్తలను అప్రమత్తం చేయాలని కేసీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు పలు ప్రచార పథకాలు రూపొందిస్తున్నాయి. ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గోపీనాథ్ మరణంతో...
మాగంటి గోపీనాథ్ గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున 2018, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే.. 2025, జూన్ 8వ తేదీన ఆయన హఠాత్తుగా మరణించారు. మరణానికి కొద్ది రోజుల ముందు.. జూన్ 5వ తేదీన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ AIG హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు.