తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ తీరుపట్ల ఎమ్మెల్సీ కవిత ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ తీరుపై నేరుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కే ప్రశ్నలు సంధించారు. తన సందేహాలను వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు సంచలన లేఖ రాశారు. బీఆర్ఎస్ నిర్ణయాలు, వ్యవహారాలపై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. ఎల్కతుర్తి సభ అనంతరం అధినేత కేసీఆర్‌కు కవిత రాసినట్టుగా ఓ లేఖ బయటికొచ్చింది. గతంలో కవిత రాసిన లేఖల్లో ఉన్న దస్తూరితో.. ఈ లేఖలోని దస్తూరీ సరిపోలుతోంది. సభ విజయవంతమైనందుకు కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ లేఖ రాసిన కవిత.. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ పేరిట 8 అంశాలను ప్రస్తావించారు.
పార్టీ లీడర్స్‌కి యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత తన లేఖలో ఆరోపించారు. మై డియర్ డాడీ... అంటూ కేసీఆర్‌కు లేఖ రాసిన కవిత.. బీజేపీతో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై సందేహాలను వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై సిల్విర్ జూబ్లీ సభలో కూడా స్పష్టత ఇవ్వలేదన్నారు. బీజేపీ మీద రెండు నిమిషాలే మాట్లాడారని.. ఆ పార్టీపై ఇంకా బలంగా మాట్లాడాల్సిందని కవిత అభిప్రాయపడ్డారు. బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటారేమో అనే చర్చ మొదలైందన్నారు. తాను సఫర్ అయ్యాను కదా.. బహుశా అందుకని కావొచ్చు అని కవిత తన లేఖలో పేర్కొన్నారు. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందని కవిత తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీపై మరింత బలంగా విమర్శలు గుప్పించాల్సిందని కవిత ఈ లేఖలో అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారని, ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఎందుకు మాట్లాడలేదు..?
తెలంగాణ తల్లి విగ్రహం, గీతం గురించి మాట్లాడతారని అంతా అనుకున్నారని.. కానీ అలా జరగలేదని కవిత తన లేఖలో పేర్కొన్నారు. ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదని.. వక్ఫ్ బిల్లు మీద కేసీఆర్ మాట్లాడతారని జనం భావించారని లేఖలో పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించారని.. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సభలో ప్రస్తావించలేదని కవిత వివరించారు. వరంగల్ సభ ఏర్పాట్ల బాధ్యతలను పాత ఇన్‌ఛార్జ్‌లకే అప్పగించారని.. స్థానిక సంస్థల బీ ఫామ్‌లు మళ్లీ మా దగ్గరకే వస్తాయని పాత ఇన్‌ఛార్జ్‌లు చెప్పుకుంటున్నారని కవిత లేఖలో ప్రస్తావించారు. ధూమ్ ధాం కళాకారులు కార్యకర్తలను ఆకట్టుకోలేకపోయారని తెలిపారు. **ఇక వరంగల్ సభలో 2001 నుంచి పార్టీలో ఉన్న వారికి మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని కవిత అభిప్రాయపడ్డారు.
కార్యచరణ అవసరం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ-ఫామ్‌లు ఇన్‌ఛార్జిల ద్వారా కాకుండా.. అధినాయకత్వమే నేరుగా ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ విఫలమైందని, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనన్న ఆలోచనలు శ్రేణుల్లో ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సహకరించామన్న భావనను ప్రజల్లోకి కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు నిర్ధిష్ట కార్యాచరణ ప్రకటిస్తారని.. లేదా మార్గనిర్దేశనం చేస్తారని అందరూ భావించినట్టు తెలిపారు.