KCR: సభా సమరానికి "సారు" సిద్ధం..!
అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ హాజరు... హాజరవుతానని నేతలకు చెప్పిన కేసీఆర్.. భవిష్యత్ కార్యాచరణపై సారు దృష్టి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో ఆయన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. పార్టీ శ్రేణులతో.. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని చెప్పినట్లు సమాచారం. నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సభ వేదికగా ఎండగట్టాలని ఆయన నిర్ణయించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. . పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేద్దామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్‌నగర్ సమీపంలోని మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులుండేలా అధికారపక్షాన్ని డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణకు రావాల్సిన నదీ జలాల వాటాలో కేంద్రం వివక్షను, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర పొడవునా తెలంగాణకు ద్రోహం చేస్తూనే వచ్చిందని, ఇప్పటి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి.. ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న జాప్యం, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలకు బలంగా వివరించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు.