తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 19న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఆయన రాజకీయంగా మరింత యాక్టివ్ అవుతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా రోజుల విరామం తర్వాత కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని కేంద్రంగా చేసుకుని ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. కాళేశ్వరం, ఇతర కీలక నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతూ జిల్లాల్లో ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారంట.
కేసీఆర్ ఇకపై ప్రజల్లోనే ఉండాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యలను వినడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా రాజకీయంగా మళ్లీ పుంజుకోవాలనే వ్యూహం రచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలులో కనిపిస్తున్న లోపాలు, అభివృద్ధిలో వెనకడుగు అంటూ అజెండాలను ఫిక్స్ చేసుకోబోతున్నారు కేసీఆర్. రెండేళ్ల పాలన తర్వాత కూడా ప్రజలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదన్న భావనను ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పార్టీ కేడర్ ను మళ్లీ యాక్టివ్ చేయడంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో జరగనున్న బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2028 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్‌గా కేసీఆర్ బయటకు వస్తున్నారంట. ఆయనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ లేదని.. అన్ని రకాలుగా పార్టీని ముందుకు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇవ్వబోతున్నారు.తన నాయకత్వాన్ని మళ్లీ ప్రజల్లో బలపరచడం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.