Telangana Budget 2022: గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కేసీఆర్ సంచలన నిర్ణయం..

Telangana Budget 2022: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.

Update: 2022-02-28 12:22 GMT

Telangana Budget 2022:vo: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సారి గవర్నర్‌ ప్రసంగం లేకుండా.... బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. బడ్జెట్‌ సమావేశాల తేదీల ఖరారు, నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా... ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు సీఎం కేసీఆర్‌.

మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకుండా సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించారు‌. రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మార్చి 7వ తేదీన ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు.

సాధారణంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంతోపాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 176 ఇదే చెబుతుంది. కానీ ఈసారి ఈ రెండు ఉండకపోయే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీకి మధ్య దూరం పెరగడంతోనే ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

గత కొంతకాలంగా.. సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళసైకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించడం దగ్గర్నుంచి ఈ గ్యాప్ పెరిగిందుటున్నాయి పార్టీ వర్గాలు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ కాపీలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర పథకాలను కూడా హైలెట్ చేస్తూ గవర్నర్ తమిళ సై ప్రసంగించడం సీఎం కేసీఆర్‌కు తీవ్ర అసంతృప్తిని కలిగించినట్లు తెలుస్తోంది.

రిపబ్లిక్ డే నాడు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు సైతం రాజ్ భవన్ వేడుకలకు దూరంగా ఉన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లిన గవర్నర్‌కు కనీస ప్రోటోకాల్ పాటించలేదన్న విమర్శలు వచ్చాయి. ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్‌ కేంద్ర పథకాలను ప్రస్తావించే అవకాశం ఉందని భావించిన సర్కారు.. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే.. బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న కేసీఆర్.. ఒక్క పైసా కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. తెలంగాణకు ఒక న్యాయం మిగతా రాష్ట్రాలకు మరో న్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి క్రమంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలు మిళితం చేసి గవర్నర్ ప్రసంగిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ.. సమావేశాల ప్రారంభమైన రోజే ఆర్థికమంత్రి హరీష్‌ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో గవర్నర్ ప్రసంగం లేదనే చెప్పొచ్చు. ఈరకంగా గవర్నర్ ప్రసంగం లేకుండా తొలి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. బడ్జెట్ ఎలా ఉండబోతుంది? ఏ..ఏ.. వర్గాలకు పెద్ద పీఠ వేస్తారు? అనేది ఒక అంశమైతే.. గవర్నర్ ప్రసంగం లేకపోవడం మాత్రం రాజకీయాంశంగా చెప్పవచ్చు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై గవర్నర్, బీజేపీ పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.

Tags:    

Similar News