TG: త్వరలో పోస్టుల భర్తీ.. బడ్జెట్ లో కీలక ప్రకటన
14,236 అంగన్ వాడీ పోస్టుల భర్తీ... వెల్లడించిన ఆర్థికమంత్రి;
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. త్వరలో 14,236 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
నిరుద్యోగిత రేటు ఎంతంటే..?
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో నిరుద్యోగిత రేటు తగ్గిందని బడ్జెట్ ప్రసంగంలో భట్టి వెల్లడించారు. నిరుద్యోగిత రేటు 22.9 నుంచి 18.1 కు తగ్గిందని వెల్లడించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.11,600 కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి తెలిపారు. ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సకల సౌకర్యాలతో ఈ స్కూళ్లను 25 ఎకరాల విస్తీర్ణంతో సిద్ధం చేస్తామని తెలిపారు.
కేంద్ర పన్నులపై భట్టి ఆగ్రహం
తెలంగాణ శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న భట్టి.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు న్యాయమైన వాటా ఇవ్వాలని కోరారు. రాష్ట్రాల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం విధిస్తున్న సెస్సులు, అదనపు ఛార్జీల వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గుతోందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల పన్నుల వాటా తగ్గుతుండడంపై ఆందోళనలు వ్యక్తమవుతోందని అన్నారు.
సోషల్ మీడియాపై కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క.. సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తిత్వ హననానికి, అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో అసత్య పోస్టులపై భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని... దానిని తాము గాడిలో పెడుతున్నామని వెల్లడించారు.