TS: నేడు తెలంగాణ కేబినేట్‌ భేటీ

కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం... గ్రూప్‌ 1, కొత్త పథకాల అమలుపై నిర్ణయాలు..

Update: 2024-02-04 03:00 GMT

బడ్జెట్, రెండు కొత్త పథకాల అమలు, గ్రూప్-1 వంటి అంశాలపై తెలంగాణ మంత్రి వర్గం నేడు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కేబినెట్ ఖరారు చేయనుంది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. 10న మద్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సచివాలయంలో మధ్యాహ్నం మూడున్నరకి తెలంగాణ మంత్రివర్గం భేటీకానుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై క్యాబినెట్‌ చర్చించనుంది. ఇప్పటికే వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం పూర్తిస్థాయికాకుండా మద్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాలని సర్కార్‌ నిర్ణయించింది.


కేంద్రప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాక కేటాయింపులు అనుసరించి కాంగ్రెస్‌ సర్కార్‌ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలు, గవర్నర్ ప్రసంగాన్ని క్యాబినెట్ భేటీలో ఖరారుచేయనున్నారు. ఈనెల 8 నుంచి అసెంబ్లీసమావేశాలు జరపాలని భావిస్తున్నారు. ఈనెల 8న గవర్నర్ తమిళసై ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభంకానున్నాయి.మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 10న ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 12 నుంచి ఐదురోజులపాటు బడ్జెట్ పద్దులపై చర్చ జరిగే అవకాశంఉంది.

రెండు కొత్తపథకాలపై మంత్రివర్గం చర్చించనుంది.500కే గ్యాస్‌సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ పథకాలను.. త్వరలోనే అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆ రెండుపథకాలకు నేడు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. గ్రూప్‌-1 పరీక్షపైనా మంత్రివర్గం చర్చించే అవకాశంఉంది. గ్రూప్-1 లో సుమారు మరో 160 అదనపు పోస్టులు జోడించడం సహా. కోర్టు వివాదాలను అధిగమించేందుకు నియామక పరీక్షల్లో సమాంతర రిజర్వేషన్ విధానం అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సుమారు 20 అంశాలపై.... ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నేడు మంత్రివర్గం నోటిఫై చేసే అవకాశంఉంది. గ్యారెంటీల అమలు, కొత్త రేషన్ కార్డులు, మేడిగడ్డబ్యారేజీపై విచారణ, సాగునీటి ప్రాజెక్టులు తదితర కీలక అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది.


Tags:    

Similar News