Khairatabad Ganesh : ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ బరువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Khairatabad Ganesh : భాగ్యనగరంలో గణేష్ నవరాత్రుల సందడి మొదలైంది.;
Khairatabad Ganesh : భాగ్యనగరంలో గణేష్ నవరాత్రుల సందడి మొదలైంది. 50 అడుగుల ఎత్తులో ఉన్న ఖైరతాబాద్ గణేశుడు.. భక్తులకు పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపంలో దర్శనమిస్తున్నారు. కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువు దీరారు. స్వామి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. కరోనాతో రెండేళ్లుగా ఖైరతాబాద్‌కు ప్రజలు రాలేకపోయారు.
వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని గవర్నర్ తమిళిసై దర్శించుకుని తొలిపూజ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యే దానం నాగేందర్.. గణేశుడిని దర్శించుకున్నారు. తొలిపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్ తమిళిసై. అందరూ సంతోషంగా ఉండేలా విఘ్నేశ్వరుడిని కోరుకున్నట్లు తెలిపారు.
ఖైరతాబాద్ గణేశుడిని మట్టితో తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు మంత్రి తలసాని. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేడుకలు నిర్వహిస్తామన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు. మనం చేసే ఏ కార్యక్రమమైనా ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగాలంటే వినాయకుడిని పూజిస్తామన్నారు.
మహా గణపతికి పద్మశాలి సంఘం.. జంధ్యం, కండువా సమర్పించింది. ప్రత్యేకంగా తయారు చేసిన 60 అడుగుల జంధ్యం, 60 కండువాను స్వామివారికి సమర్పించారు. గత 15 ఏళ్లుగా ఖైరతాబాద్ గణపతికి జంధ్యం సమర్పిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా క్రమం తప్పకుండా మొక్కు చెల్లించుకున్నారు. అటు.. ఖైరతాబాద్ గణేష్‌కు 900 కేజీల భారీ లడ్డును నైవేద్యంగా సమర్పించింది మియాపూర్‌కు చెందిన శ్రీ భక్తాంజనేయ స్వీట్స్.
మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. ఇక.. గణేష్ మండపం ఎదురుగా ఉన్న ప్రధాన నాలుగు రహదారులు నిఘా నీడలోకి వెళ్లాయి.