Kishan Reddy: కేంద్ర మంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కిషన్​రెడ్డి

కిషన్‌రెడ్డి 2.0

Update: 2024-06-10 01:00 GMT

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దిల్లీలో నిర్వహించిన బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో, రెండోసారీ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు మోదీ మంత్రివర్గంలో కేంద్ర పర్యాటక శాఖమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

సికింద్రాబాద్‌ నుంచి ఎన్నికైన కిషన్‌రెడ్డిని అందరూ అభిమానంగా ‘కిషనన్న’ అని పిలుచుకుంటారు. ఇలా అందరి అభిమానాన్ని చూరగొన్న కిషన్‌రెడ్డి నగరాభివృద్ధిలో ఎప్పుడూ కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. కఠినమైన పరిశ్రమ, అంకితభావంతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చనడానికి నిలువెత్తు నిదర్శనం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా పని చేసుకుపోవడం కిషన్‌రెడ్డి బలం. అందుకే నగరం నుంచి ఒకే ఒక్క ఎంపీగా విజయం సాధించినప్పుడూ కేంద్రమంత్రి అయ్యారు.. ఇప్పుడు 8 మంది ఎంపీలున్నా కేంద్ర కేబినెట్‌లో ఆయన స్థానానికి ఢోకా లేకుండా అయ్యింది.

కొనసాగిన లష్కర్‌ ఆనవాయితీ : సికింద్రాబాద్‌ ఆనవాయితీ కొనసాగుతోంది. లష్కర్‌లో ఎన్నికైతే కేంద్రమంత్రి పదవి ఖాయమనే భరోసా నిజమైంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయ రెండుసార్లు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1991లో మొదటిసారి బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్‌ నుంచి విజయం సాధించారు. 1998లో మళ్లీ అక్కడి నుంచే విజయం సాధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో గెలిచినప్పటికీ కేంద్రమంత్రిగా అవకాశం లభించలేదు. మళ్లీ 2014లో గెలిచి కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత 2019లో కిషన్‌రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ముందుగా బాధ్యతలు నిర్వర్తించి.. తర్వాత పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్‌ ఎంపీగా విజయం సాధించి రెండోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. 

ప్రమాణస్వీకారానికి ముందు దిల్లీలో మాట్లాడిన కిషన్​రెడ్డి, సంకల్పపత్రం పేరుతో సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే అయిదేళ్లు అంకితభావంతో పని చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా గత పదేళ్లలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని, రాబోయే రోజుల్లో పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని వివరించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News