ఉమ్మడి వరంగల్ జిల్లాలో హస్తం నేతల పరస్పర ఫిర్యాదులపై విచారణ చేపట్టిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు.. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాజరయ్యారు. తాను ఇచ్చిన వివరణతో క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందిందని చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. పార్టీకి, పార్టీ పెద్దలకు ఇచ్చిన మాటను జవదాటనని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నదే తమ అందరి కోరికన్నారు. వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి గాంధీ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్రమశిక్షణా కమిటీ కంటే ముందే నేనే వచ్చాను.. గాంధీ భవన్కు రావొద్దా ఏంటి అని అక్కడ పలువురిపై కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది.