ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో ఆ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువన జూరాల జలాశయానికి నీటిని వదిలారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 62,955 క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతోంది. రెండు మూడు రోజుల్లో జూరాల నిండనుంది. ఆ తర్వాత గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదలనున్నారు. కృష్ణా నదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతోంది.
మరోవైపు తుంగభద్రలో వరద ప్రవాహం నిలకడగానే కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి భీమా కాల్వ, బీమా-2 కాల్వలకు 2421 క్యూసెక్కుల నీటిని వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి స్పల్ప వరద ప్రవాహం ప్రారంభమైంది. జూరాల జలాశయం నుంచి 7,500 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది.
శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 808.40 అడుగులు ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.3895 టీఎంసీలుగా ఉంది. నాలుగైదు రోజుల్లో శ్రీశైలానికి వరద జలాలు వచ్చే అవకాశం ఉండటంతో అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాలైన కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. 22,089 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం అధికారులు దిగువకు వదులుతున్నారు.