KTR: మహిళా కమిషన్‌ ముందు హాజరైన కేటీఆర్‌

అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తల యత్నం... అండగా బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు;

Update: 2024-08-24 06:30 GMT

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ మహిళా కమిషన్‌ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకరంగా నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి మాట్లాడుతూ.. మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మహిళా కమిషన్‌ ముందు విచారణకు హాజరయ్యారు. బుద్ధభవన్‌ లోపలికి కేటీఆర్‌ను మాత్రమే అనుమతించారు. అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లను లోనికి రానివ్వలేదు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఆందోళన చేపట్టారు.


మరోవైపు కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ.. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, నేతలు బుద్ధభవన్‌ మహిళా కమిషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మహిళా లోకాన్ని ఆయన అవమానించారని విమర్శించారు. పోటాపోటీ ఆందోళనలతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారాస, కాంగ్రెస్‌ మహిళా నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బస్సుల్లో అల్లం- వెల్లుల్లి, కుట్లు, అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘బస్సుల్లో కుట్లు, అల్లికలు మేం వద్దనట్లేదు. అవసరమైతే బ్రేక్‌ డ్యాన్స్‌లు వేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు తన్నుకుంటున్నారు. ఆర్టీసీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నాం’’ అని కేటీఆర్‌ అన్నారు.

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా మాజీమంత్రి కేటీఆర్‌ను ఉమెన్ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో మహిళా కమిషన్‌ ముందు వివరణ ఇచ్చేందుకు ఆఫీసుకు వెళ్లిన కేటీఆర్‌ కు నిరసన సెగ తగిలింది. కేటీఆర్‌ వస్తున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్‌ నేతలు కమిషన్‌ దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక, మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకునేందుకు వస్తున్న కేటీఆర్‌ వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు. మహిళలకు కేటీఆర్‌ తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో, అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అలర్ట్ అయిన.. పోలీసులు అక్కడ ఉన్న వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో బుద్ద భవన్ దగ్గర తోపులాట, ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ తోపులాటలో పలువురు గాయపడినట్టు సమాచారం. మరోవైపు.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది.

Tags:    

Similar News