KTR: మహబూబ్‌నగర్ జిల్లాలో కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
KTR: మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు..;
KTR: మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు.. జడ్చర్ల మండలం కోడుగల్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లతోపాటు రైతు వేదికను ప్రారంభించారు. కేటీఆర్ వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తోపాటు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వున్నారు.. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ, మౌలిక సదుపాయాలు కల్పిస్తోందన్నారు.
పల్లెల్లోనూ, మన్యం ప్రాంతాల్లోనూ అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ సేవలందిస్తూనే ఉంటారన్నారు. తెలంగాణ తరహాలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చూపిస్తే చర్చకు సిద్ధమని ఆ పార్టీ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకపోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు.
ఆ తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేటలో ఎంజీఆర్ ట్రస్ట్ సహకారంతో అధునాతన సదుపాయాలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణలో ఉన్నన్ని గురుకులాలు ఏ రాష్ట్రంలో లేవని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేళ్లుగా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.. పాలమూరు జిల్లాలో సాగునీటి కష్టాలు లేవన్నారు.
ఈ జిల్లాలకు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వస్తుండటం చూస్తున్నామన్నారు కేటీఆర్. ఇక ఇదే వేదికగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు వస్తున్న ప్రధాని మోదీ.. తెలంగాణను కూడా సమాన దృష్టితో చూడాలన్నారు మంత్రి కేటీఆర్. ఎంజీఆర్ ట్రస్ట్ సేవలను కూడా కేటీఆర్ కొనియాడారు.. ఎంత కాలం బతికామన్న దానికన్నా ఎంత గొప్ప పనులు చేశామో గుర్తిండి పోతుందని అన్నారు..
మర్రి జనార్థన్ రెడ్డి తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు పాఠశాలలు నిర్మిస్తున్నట్లు చెప్పడం తన గొప్పతనం అన్నారు.. జెడ్పీ హైస్కూల్ కార్పొరేట్ పాఠశాల కన్నా గొప్పగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఇప్పుడు ఉన్నత స్థానాల్లో వున్న వారు ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా కోడుగల్, లింగంపేట గ్రామాల్లో కేటీఆర్ పర్యటన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు.. బీజేపీ నాయకులు ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నాయకులు కాన్వాయ్ వైపు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు పలువురు బీజేపీ, బీఎస్పీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. కోడుగుల్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు.. ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరుకు ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వస్తున్నారని గుర్తు చేశారు.. అటు కేంద్ర ప్రభుత్వ తీరుపైనా కేటీఆర్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.