KTR : అప్పుడే సెక్రటేరియట్ ఓపెనింగ్‌‌కు రెడీ అవుతుంది : కేటీఆర్

KTR : తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు మంత్రి కేటీఆర్.

Update: 2022-08-06 03:15 GMT

KTR : తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని.. సమర్థుడైన కేసీఆర్‌ సీఎంగా ఉన్నారని చెప్పారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా.. ఆయన నెటిజన్లతో ఆస్క్‌ కేటీఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలతోనే తమ పొత్తు ఉంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో ఒరిగేదేమి ఉండదన్నారు. పేదలకు ఏ మాత్రం మేలు చేయని ప్రధాని మోదీ...కార్పొరేట్లకు మాత్రం 12 లక్షల కోట్లు మాఫీ చేశారని చెప్పుకొచ్చారు.

విపక్ష సర్కార్ కూల్చివేతలపై కాకుండా రూపాయి పతనం నిరోధించే అంశంపై ఆయన దృష్టి సారించాలన్నారు. బీజేపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా...ఖాళీ గిన్నెలక మోత ఎక్కువ అంటూ సమాధానమిచ్చారు. కొత్త సెక్రటేరియట్ దసరాకు సిద్ధమవుతుందన్నారు.

జీఎస్టీ పాలక మండలి సలహా మండలి మాత్రమేనన్నారు కేటీఆర్. అధిక పన్నులు సిఫార్సు చేసినంత మాత్రాన అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. జీఎస్టీ మండలిలో మెజార్టీ ఉండడంతో మోదీ సర్కార్ ఎడా పెడా పన్నులు పెంచుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ నిధులను విడుదల చేస్తే..మోదీ సర్కార్ అందుకు నిరాకరిస్తోందన్నారు. భూ సేకరణ సమస్యతో ఫార్మా సిటీ ప్రారంభంలో జాప్యం జరుగుతోందన్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలన్నారు కేటీఆర్.

వచ్చే ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫార్మూలా ఈ-రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తుందన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఫన్‌ డేను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరిన్ని సైక్లింగ్‌ లేన్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. HMDA పరిధిలో ఇప్పటికే 19 అర్బన్ పార్కులు వచ్చాయని...త్వరలోనే మరిన్ని వస్తాయన్నారు. హైదరాబాద్‌లో మురుగు, వరదనీటి కాల్వలు మెరుగుపరిచేందుకు కృషి జరుగుతోందన్నారు. మూసీ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.


Tags:    

Similar News