బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసే ఆలోచన ఉందని పేర్కొన్నారు. పాదయాత్ర చేయాలనే ఆలోచన ఉన్నా.. దీనికి ఇంకా కొంత సమయం పడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మరో మూడేళ్లు పట్టొచ్చని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. పాదయాత్రకు ఇప్పడిప్పుడే తొందరేం లేదని.. కానీ తప్పకుండా చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిపాటు సమయం ఇవ్వాలనుకున్నాం, ఇచ్చామని ఇప్పుడా గడువు తీరుతోందని కేటీఆర్ అన్నారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదని అంచనావేశారు. గవర్నర్ సంతకం చేసే అవకాశం లేదని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు తెలిపారు.
అప్పటివరకూ రైతులకు కన్నీళ్లే- కేటీఆర్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యే వరకు తెలంగాణ రైతులు కన్నీళ్లనే తప్ప సాగునీళ్లను చూడలేరని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు సాగు, తాగు నీటికి కష్టాలు లేకుండా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లుగా రాష్ట్రంలో ప్రతి బిడ్డ కేసీఆర్‌ను గుర్తుపెట్టుకుంటుందన్నారు. బీజేపీ జాతీయవాదంపై మాజీ మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్నలు సంధించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌తో క్రికెట్ ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించారు. పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించిన కేటీఆర్.. జాతీయవాదాన్ని తమ బ్రాండ్‌గా చెప్పుకునే బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. ఈ విషయంపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు శఠగోపం పెట్టారు: కేటీఆర్
13 లక్షల మంది విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ శఠగోపం పెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి డబ్బులు లేవని డిప్యూటీ సీఎం అంటున్నారని, ఇది చాలా అన్యాయం ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్లలో ఏకంగా రూ. 20వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సరే.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని సూచించారు.