KTR: రేవంత్ తీరు చూస్తే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది
మరోసారి కేటీఆర్ తీవ్ర విమర్శలు... కూల్చివేతలేనా మీ పాలన అని ఫైర్.. రేవంత్‌ను భీమవరం బుల్లోడా అనాలా అంటూ కేటీఆర్ ఫైర్ ##
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి వాడుతున్న భాష, ఆయన రాజకీయ ప్రయాణం , పాలనపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శేరిలింగంపల్లికి చెందిన కొంత మంది నేతలు పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పేగులు మెడలో వేసుకోవడం, గుడ్లు పీకి గోటీలాడటం వంటి మాటలు ఒక ముఖ్యమంత్రికి తగునా అని ప్రశ్నించారు. తనకు కూడా ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లీషులో పొల్లు పోకుండా తిట్టడం వచ్చని, కానీ ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న గౌరవాన్ని బట్టి సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించిన నాయకుడు, తన తండ్రి అయిన కేసీఆర్‌ను తిడితే ఒక కొడుకుగా ఆవేశం రావడం సహజమని, రేవంత్ తీరు చూస్తే ఎడమ కాలి చెప్పుతో కొట్టాలనిపిస్తుందని, కానీ ప్రజాస్వామ్యంపై గౌరవంతో ఆగుతున్నామని మండిపడ్డారు. ‘‘ఎన్నో హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి అన్నీ ఎగవేశారు. ఆయన కిస్మత్ బాగుండి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారు. హామీల గురించి ప్రశ్నిస్తే రేవంత్ బూతులు తిడుతున్నారు. తిట్ల భాష మాకూ వచ్చు.. కానీ మేం తిట్టం. పెంచుతామన్న పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారో సీఎం చెప్పాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను వరుసగా రెండుసార్లు గెలిపించారు. హైదరాబాద్ ప్రజలకు నేను పాదాభివందనం చేసినా తక్కువే. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ తట్టుకోలేరు’’ అని కేటీఆర్ అన్నారు.
రేవంత్‌వి లంగా పనులు
గతంలో రేవంత్ రోడ్ల మీద పెయింటింగ్స్ వేసుకునేవాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏ వ్యక్తి అయినా కష్టపడి పైకి రావడం తప్పులేదని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం దొంగ పనులు, లంగా పనులు చేసి, ఓటుకు నోటు కేసులో బ్యాగులు మోస్తూ దొరికిపోయి జైలుకు వెళ్లారని విమర్శించారు. ఢిల్లీ పెద్దలకు పైసలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తికి సంతోషం ఉండాలి కానీ, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి అడిగితే ఏడుపు మొహం పెట్టి ఎదురుదాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీకి రావాలంటూ కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసరడంపై కేటీఆర్ స్పందిచారు. కేసీఆర్ గారు బయటకు వచ్చి కేవలం ఒక ప్రెస్ మీట్ పెడితేనే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టి చలిజ్వరం వచ్చింది. ఇక ఆయన అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డికి గుండె ఆగి చస్తాడు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినట్లుగా నేడు తెలంగాణ పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.