KTR: గవర్నర్ అనుమతితో బీఆర్ఎస్లో కలకలం
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం.. కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ అనుమతి
మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు సెప్టెంబర్ 9న రాజ్‌భవన్‌కు ఏసీబీ ఫైలు పంపింది. అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లో ఉంది. అయితే రాష్ట్రపతి కార్యాలయం నుంచి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ గురువారం ఉదయం కేటీఆర్‌పై విచారణకు అనుమతినిస్తున్నట్లుగా ఫైలుపై సంతకం చేశారు.
పలుమార్లు విచారణకు హాజరు
సెప్టెంబర్ 9న రాజ్‌భవన్‌కు ఏసీబీ ఫైలు పంపగా, రాష్ట్రపతి కార్యాలయం నుంచి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ బుధవారం గురువారం ఉదయం కేటీఆర్‌పై విచారణకు అనుమతినిస్తున్నట్లుగా ఫైలుపై సంతకం చేశారు. ఈ తాజాగా పరిణామంతో కేటీఆర్‌తో పాటు మాజీ HMDA చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) బీఎల్వీ రెడ్డి, మాజీ ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్లపై ఏసీబీ త్వరలోనే చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు మరింత వేగం పుంజుకోనుంది. ఇదే కేసులో కేటీఆర్ నాలుగు సార్లు ఏసీబీ విచారణకు కూడా హాజరైన విషయం తెలిసిందే.
రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు
ఇటీవలే ఫార్ములా -ఈ కార్ రేసు కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ కార్రేసును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ రూ. 50 వేలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొందిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక (సవరణ) చట్టం ప్రకారం 17ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకున్నామని తెలిపారు. అనంతరం ఏసీబీ పూర్తి ఆధారాలతో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిందని... దానిపై ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోసం లేఖ రాసిందని చెప్పారు. తాము అరెస్ట్ చేయాలని అనుకున్నప్పటికీ, మూడు నెలల నుంచి గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని... దాంతో అది అక్కడే నిలిచిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. తాజాగా ఏసీబీ అధికారులకు అనుమతి ఇస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో త్వరలోనే ఏసీబీ ఛార్జీషీట్ దాఖలు చేయనుంది. కేటీఆర్ విచారణకు ఓకే చెప్పడంతో తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరగనుంది.