KTR: 4 రోజుల్లో అన్ని ఆధారాలతో బయటపెడుతా: కేటీఆర్
సీఎం రేవంత్ పై సంచలన ఆరోపణలు
సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపు, అహంకారపూరిత, నియంతృత్వ పోకడల కారణంగానే ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో నుంచి అర్ధంతరంగా వైదొలగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తాము అధికారం నుంచి దిగిపోయే ముందు, హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు రచించామని కేటీఆర్ వెల్లడించారు. ఓఆర్ఆర్ చుట్టూ 160 కి.మీ., భువనగిరి, సంగారెడ్డి, షాద్‌నగర్, కడ్తాల్ వరకు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపామని.. అత్యంత కీలకమైన మైండ్‌స్పేస్-శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తిచేసి, కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించామని అన్నారు. ఎల్అండ్టీకి కేటాయించిన 280 ఎకరాల విలువైన భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి, ఆయన సన్నిహితుల కన్ను పడిందని ఆరోపించారు. ఆ భూములను అడ్డగోలుగా అమ్ముకోవడానికి లేదా తమ అనుయాయులకు చెందిన సంస్థలకు కట్టబెట్టడానికే ఈ స్కెచ్ వేశారన్నారు. మరో కార్పొరేట్ సంస్థను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో నాలుగైదు రోజుల్లో ఆధారాలతో సహా బయటపెడతానని కేటీఆర్ వెల్లడించారు. అలాగే.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.