Lal Darwaza Bonalu : తెలంగాణ భవన్‌లో లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభం.
లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ఈ రోజు ప్రారంభించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ సభ్యులు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మహంకాళి అమ్మవారికి బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో, పూర్ణకుంభాలతో, మంగళ వాయిద్యాల నడుమ గవర్నర్‌కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయల్ కూడా గవర్నర్‌కు సత్కారాన్ని అందజేశారు.
అలాగే, ఢిల్లీలో నివాసముంటున్న తెలంగాణ ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల భక్తులకు కూడా ఈ ఉత్సవం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ఫోటో ఎగ్జిబిషన్‌లో ఢిల్లీలో గతంలో జరిగిన లాల్ దర్వాజా బోనాల సమయంలో తీసిన అరుదైన చిత్రాలు, అమ్మవారి ఊరేగింపులు, పోతురాజులు, కళాపరిచయాలు సహా పలు చారిత్రక దృశ్యాలు ప్రదర్శించబడ్డాయి.
మిగతా కార్యక్రమాలు:
జూలై 1, 2025: ఇండియా గేట్ నుండి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి గద్దెల ఊరేగింపు,ఘఠ స్థాపన.
జూలై 2, 2025: పోతురాజు స్వాగతం, తెలంగాణ ప్రజల కళలను ప్రతిబింబించే సాంస్కృతిక నృత్యాలు, అమ్మవారికి బంగారు బోనం సమర్పణ మరియు సంప్రదాయ కార్యక్రమాలు.
ఈ సందర్భంగా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ ఉత్సవాలను ఢిల్లీలో ఘనంగా నిర్వహించే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి,దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ,న్యూఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి శ్రీ ఏ.పి. జితేందర్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.