Liquor Scam : ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ వెళ్లే ముందు కవిత తన తండ్రి.. సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు;
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయల్దేరారు. బంజారాహిల్స్ నివాసం నుంచి ప్రగతి భవన్ రాకుండానే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. మార్చి 9వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో కవిత ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి వెళ్లే ముందు ఆవిడ తండ్రి, సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తారని ప్రచారం సాగింది. కవిత మాత్రం కేసీఆర్ ను కలవకుండానే ఢిల్లీకి బయలు దేరారు.
ఢిల్లీ వెళ్లే ముందు కవిత తన తండ్రి.. సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. నీ కార్యక్రమాల్ని నువ్వు కొనసాగించు.. ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ కవితకు కేసీఆర్ ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. ఈడీ నోటీసుల నేపథ్యంలో.. బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాడదాం.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
న్యాయ నిపుణుల సలహా మేరకే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయల్దేరినట్లు సమాచారం. రేపు విచారణకు హాజరు కాలేనని ఈడీకి ఇప్పటికే కవిత లేఖ రాశారు. 15 తర్వాత హాజరవుతానని అందులో పేర్కొన్నారు. కవిత లేఖపై ఈడీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో.. ఢిల్లీలో ఈడీకి అందుబాటులో ఉండాలని న్యాయ నిపుణులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ రేపటి వరకు, ఈడీ నుంచి అనుమతి రాకపోతే.. ఈడీ ముందు హాజరు కావడం తప్పదని న్యాయ నిపుణులు చెప్పినట్లు సమాచారం. వ్యక్తిగతంగా హాజరై 15వ తేదీ వరకు సమయం కోరాలని సలహా ఇవ్వడంతోనే.. కవిత ఢిల్లీకి బయల్దేరినట్లు తెలుస్తోంది.