LOCAL WAR: రెండో దశలోనూ హస్తం హవా
కాంగ్రెస్‌కు సగానికిపైగా సీట్లు... బీఆర్ఎస్కు 25 శాతానికి పైగా సీట్లు... సిద్దిపేటలో టాప్ గేరులో ‘కారు’
పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. తొలి విడతలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న హస్తం పార్టీ.. మలి విడతలోనూ అదే జోరు కొనసాగించింది. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. మలి విడతలో 192 మండలాల పరిధిలోని 3911 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 2200కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మెజారిటీ సీట్లను సాధించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ తన పట్టును నిలుపుకున్నట్లయింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా మలి విడత ఫలితాలు కాస్త ఊరటనిచ్చాయి. 1100కు (25 శాతానికి) పైగా సీట్లను గెలుచుకోవడం ద్వారా గ్రామాల్లో తన ఉనికిని చాటుకుంది. మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి తొలి విడతతో పోలిస్తే స్వల్పంగా సీట్లు పెరిగాయి. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలూ పది శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకున్నాయి. మలి విడతలో మొత్తం 4332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 415 స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 3,911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాగా, రెండో విడతలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ రెబల్సే ఉండడం గమనార్హం.
రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ వెనకంజలోనే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో 25 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకోవడం ఊరట కలిగించే అంశమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి, రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో 25 శాతానికి పైగా సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో ఆ పార్టీ తన ఉనికిని చాటుకుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది బీఆర్‌ఎ్‌సకు పెద్ద ఊరటేనని విశ్లేషకులు చెబుతున్నారు. మలి విడతలో కడపటి వార్తలు అందేసరికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 1195 సీట్లు గెలుచుకున్నారు. మలి విడతలోనూ కేసీఆర్, హరీశ్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఈ జిల్లాలో మలి విడతలో 186 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా వందకు పైగా సీట్లలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. ఇతరులు 36, కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లలో విజయం సాధించాయి. హరీశ్ నియోజకవర్గంలోని 91 పంచాయతీల్లో 78 బీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్ 5 స్థానాలకే పరిమితమైంది. జనగామ జిల్లాలో కాంగ్రెస్ 30 సర్పంచ్ సీట్లు గెలుచుకుంటే.. బీఆర్ఎస్ 37 సీట్లు సొంతం చేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌కు 24, బీఆర్‌ఎ్‌సకు 40 సీట్లు వచ్చాయి. మలి విడతలో మొత్తం 4332 సర్పంచ్ సీట్లకు గాను కడపటి వార్తలు అందేసరికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 2331స్థానాలను గెలుచుకున్నారు. మరోవైపు జిల్లాల వారీగానూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది.
పంచాయతీ పోరులో విషాదాలు
పంచాయతీ ఎన్నికలు కొన్ని కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చాయి. ఓ అభ్యర్థి పోలింగ్ రోజున హఠాత్తుగా మరణించగా, మరో చోట ఎన్నికల బరిలో నిలిచిన తన కూతురికి ఓటేసిన కాసేపటికే తండ్రి చనిపోయాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామానికి చెందిన దామాల నాగరాజు (40) సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో నాగరాజు కొద్దిరోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో నాగరాజు ఆదివారం ఉదయం బ్రెయిన్ డెడ్‌కు గురై మరణించారు. ఆదివారం జరిగిన పోలింగ్‌లో నాగరాజుకు 16 ఓట్లు వచ్చాయి. ఇక, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం వెంకన్నగూడ గ్రామానికి చెందిన పోలిసేట బుచ్చయ్య(70) కుమార్తె రాములమ్మ ఆలూరు పంచాయతీ 14వ వార్డు సభ్యురాలిగా పోటీ చేశారు. ఆదివారం జరిగిన పోలింగ్‌లో భాగంగా ఓటేసిన బుచ్చయ్య పోలింగ్ కేంద్రంలో నుంచి బయటికి వస్తుండగా మూర్ఛ వచ్చి ఆ ఆవరణలోనే కుప్పకూలిపోయాడు.