Madhu Yashki: విషనగరంగా మారుతున్న భాగ్యనగరి... పాపమంతా బీఆర్ఎస్ దే..: మధుయాష్కీ ఫైర్
విశ్వనగరం హోదాను కోల్పోతున్న హైదరాబాద్; డ్రగ్స్ మత్తులో విషనగరంగా మారుతున్న వైనం; బీఆర్ఎస్ తప్పిదం వల్లే ఇదంతా.. మాజీ ఎంపీ మధు యాష్కీ ఆరోపణలు;
Madhu Yashki: అంతర్జాతీయ స్థాయి వనరులతో విశ్వఖ్యాతి గడించిన హైదరాబాద్ నేడు ఆ కీర్తిని కోల్పోయిందని పీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా డ్రగ్స్ అందుబాటులోకి రావడంతో మహానగరం విషనగరంగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ డ్రగ్స్ రాజధానిగా మారిందని విమర్శించారు. యువత డ్రగ్స్ కు బానిసైందని దుయ్యబెట్టారు. న్యూ ఇయర్ వేడుకల కోసం పోలీసులు ఏకంగా 900 రేవ్ పార్టీలకు అనుమతులు జారీ చేశారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కేబీఆర్ పార్క్ వద్ద డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంల ో పాల్గొన్న మధుయాష్కీ నగరంలో డ్రగ్స్ వాడకం పెరుగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు దిశానిర్దేశం చేసి పెద్ద దిక్కుగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, డ్రగ్స్ తో వారి జీవితాలను నాశనం చేస్తోందని ఘాటుగా విమర్శించారు. ఇది అత్యంత దారుణమని వ్యాఖ్యానించారు.