హైదరాబాద్‌కు పెను గండం ముంచుకొస్తోంది. గత ఆరు రోజులుగా నగరంలో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వానలతో హైదరాబాద్ ఆగమాగమవుతోంది. నగరంలో పరిధిలో ఉన్న చెరువులు, కుంటలన్నీ ఇప్పటికే మత్తడి పోస్తున్నాయి. హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. మూసీ కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద పెరిగితే ప్రమాదమే. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. బుధవారం భారీ వర్షం కురిస్తుందని తెలిపింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు జంట జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఎగువ నుంచి వరద పెరగడంతో గండిపేట నుంచి నీటిని విడుదల చేశారు. 2 గేట్లను ఎత్తి 230 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. క్రమంగా అవుట్ ఫ్లో పెంచుతున్నారు. హిమాయత్ సాగర్ డ్యాం గేట్లను ఎత్తనున్నారు. దీంతో మూసీకి వరద మరింత పెరగనుంది. ఇవాళ వర్షం కురిస్తే నగరవాసులకు గండం తప్పదనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.