మణిపుర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడి నిట్, ఇతర విద్యా సంస్థల్లో చదువుతున్న 250 మంది వరకు తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇదే అంశంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లు సమీక్ష నిర్వహించారు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌కు ప్రత్యేక విమానాన్ని పంపించనున్నారు. రాత్రిలోపు వారిని హైదరాబాద్ తీసుకురావాలని నిర్ణయించారు. ఈమేరకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడారు.
ప్రత్యేక విమానంలో తరలింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు పోలీస్ శాఖ అనుక్షణం పర్యవేక్షించనుంది. మణిపుర్‌లో ఈనెల 3న నిర్వహించిన గిరిజన సంఘీభావ ర్యాలీ అనంతరం చెలరేగిన హింసలో పదుల సంఖ్యలో స్థానికులు మృతి చెందారు. అల్లర్ల కారణంగా వేల సంఖ్యలో జనం ఆర్మీ శిబిరాల్లో తలదాచుకున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న తెలంగాణవాసుల విషయంలో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం వారిని తెలంగాణ తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది.