Maoists Varotsavalu: ములుగు జిల్లాలో హై అలెర్ట్.. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో..

Maoists Varotsavalu: ఇవాళ్టి నుంచి వచ్చేనెల 3 వరకు మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Update: 2022-07-28 10:02 GMT

Maoists Varotsavalu: ఇవాళ్టి నుంచి వచ్చేనెల 3 వరకు మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసులు ఎక్కడికక్కడ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మావోల అగ్రనేతలు సంచరిస్తున్నారన్న సమాచారంతో.. చెట్లు పుట్టలను జల్లెడ పడుతున్నారు. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. అటు ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది.

ములుగు ఏరియాలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో మావోయిస్టుల కరపత్రాలు వెలుగు చూడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు వారోత్సవాలను విఫలం చేసేందుకు.. ఆదివాసీ గ్రామాల్లో సోదాలు ముమ్మరం చేశారు. అనుమానిత వ్యక్తులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. గ్రామాల్లోని మావోయిస్టు సానుభూతిపరులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మరోవైపు అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలంటూ మవోయిస్టు నేత ఆజాద్‌ పేరిట లేఖ వెలుగులోకి రావటంతో ప్రత్యేక బలగాలు అప్రమత్తమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలోని చర్ల, దుమ్మగూడెం మండలాల్లో సానుభూతిపరుల కదలికలపై పోలీసు బలగాలు ఆరా తీస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్య గ్రామాల్లో రాకపోకలపై డేగకన్ను వేశారు. అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని విధ్వంసకర ఘటనలు పాల్పడకుండా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు..

Tags:    

Similar News