Medaram Jathara: ముగింపు దశకు మేడారం మహా జాతర.. రెండు రోజుల్లో 75 లక్షల మంది దర్శనం..

Medaram Jathara: వన దేవతల దర్శనానికి వీఐపీల తాకిడి పెరిగింది. గవర్నర్‌ తమిళిసై ఇవాళ జాతరకు వెళ్తారు.

Update: 2022-02-19 04:24 GMT

Medaram Jathara: మేడారం మహా జాతర ముగింపు దశకు చేరింది. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వన ప్రవేశం చేయనున్నారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తుండటంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. జంపన్న వాగు జన ప్రవాహమైంది. తల్లుల వన ప్రవేశంలోగా మరో 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

వన దేవతల దర్శనానికి వీఐపీల తాకిడి పెరిగింది. గవర్నర్‌ తమిళిసై ఇవాళ జాతరకు వెళ్తారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో మేడారానికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. అటు.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కూడా మేడారం వెళ్లనున్నారు. గుట్టమ్మ వద్ద నుంచి రెండు వందల వాహనాల్లో కార్యకర్తలతో కలిసి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తున్నారు.

మేడారం జాతరలో నిన్న మూడో రోజు కూడా అదే జోరు కొనసాగింది. సమ్మక్క గద్దెపైకి చేరిన తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. రెండు రోజులుగా 75 లక్షల మంది రాగా.. నిన్న 25 లక్షల మందికి పైగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.

Tags:    

Similar News